Business
రష్యా భరోసా – భారత్‌కి మేమున్నాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై అదనంగా 25% టారిఫ్‌లు విధించాలనే నిర్ణయం తీసుకోవచ్చన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించడంలో కష్టాలు ఏర్పడతాయన్న భయాలు వ్యాపార వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే, ఈ పరిస్థితులపై రష్యా స్పష్టమైన భరోసా ఇచ్చింది.
భారతదేశంలో రష్యా అంబాసిడర్‌గా ఉన్న రోమన్ బాబుష్కిన్ స్పందిస్తూ, “ఒకవేళ అమెరికా మార్కెట్‌లో భారత్‌కు అవాంతరాలు ఎదురైతే ఆందోళన అవసరం లేదు. మేమున్నాం. భారత ఎగుమతులను స్వాగతించేందుకు రష్యా మార్కెట్ సిద్ధంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు భారత గూడ్స్‌ను మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం భారత్‌లోని వ్యాపార, ఎగుమతి రంగానికి కొంత ఊరటనిచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇండో–రష్యన్ వాణిజ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇరుదేశాలు రక్షణ, ఇంధన, వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధ రంగాల్లో సహకారం కొనసాగిస్తున్నాయి. అమెరికా టారిఫ్‌లు భారత్‌కు కొత్త సవాళ్లు విసిరినా, రష్యా ఇచ్చిన ఈ భరోసా భారత్‌కి ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలను తెరుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.