International
మోదీ ప్రభుత్వం పాకిస్థాన్కు లొంగిపోయింది: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన సందర్భంగా మోదీ ప్రభుత్వం కేవలం 30 నిమిషాల్లోనే పాకిస్థాన్కు లొంగిపోయిందని ఆరోపించారు. దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమయంలో బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్ ముందు దోర్లే ధోరణిని అనుసరించిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రజలకు పూర్తి నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ పాటిద్దామని భారత్ అడిగింది. ప్రభుత్వం ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అంటే స్పష్టంగా చెప్పాలంటే పాకిస్థాన్‌తో పోరాడే ఆలోచనే లేదు. ఇదేంటి దేశ భద్రతపై ఈ స్థాయిలో రాజీ పడతారా?” అని ప్రశ్నించారు. ఇది బీజేపీ నాయకత్వం ఉద్దేశపూర్వకంగా తీసుకున్న తప్పిద నిర్ణయమేనని విమర్శించారు.
ఇందుకే భారత విమానాలు కూలిపోయాయని, భారత వైమానిక దళం (IAF) ఎలాంటి తప్పు చేయలేదని, పూర్తిగా రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సైన్యం శ్రేయస్సు కోసం రాజకీయంగా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. “దేశ భద్రతను రాజకీయ లాభాలకు తాకట్టు పెట్టొద్దు” అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.