Andhra Pradesh
మొంథా తుపానుతో ఏపీకి రూ.5,265 కోట్ల నష్టం – వ్యవసాయం, ఆక్వా రంగాలకు భారీ దెబ్బ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంథా తుపాను భారీ ప్రభావం చూపింది. ఈ తుపాను కారణంగా రాష్ట్రానికి మొత్తం రూ.5,265 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా అధికారులు వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గురువారం నష్టం వివరాలపై సమీక్ష నిర్వహించారు. తుఫాను వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ పలు రంగాలకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయం, ఆక్వా, రోడ్లు, భవనాల శాఖలు భారీగా నష్టపోయాయి.
వ్యవసాయ రంగానికి రూ.829 కోట్లు, ఆక్వా రంగానికి రూ.1,270 కోట్లు, రోడ్లు మరియు భవనాల శాఖకు రూ.2,079 కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు వివరించారు. హార్టికల్చర్, సెరికల్చర్, పంచాయతీ రాజ్, హౌసింగ్, పశుసంవర్ధక శాఖలకు కూడా కొంత మేర నష్టం జరిగినట్లు తెలిపారు. ఈ తుపానులో 120 పశువులు మృతి చెందాయని వెల్లడించారు. అయితే నీటిపారుదల శాఖకు ఈసారి పెద్దగా నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు, ముందస్తు చర్యల వలన ప్రాణనష్టం తప్పిందని చెప్పారు. శాటిలైట్ ఫోటోలను ఆధారంగా చేసుకొని తుపాను గమనాన్ని ముందుగానే అంచనా వేసినందున నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. కాకినడా వద్ద తీరం దాటుతుందని భావించిన తుఫాను చివరికి నరసాపురం వద్ద తీరం దాటిందని వివరించారు.
చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రతి కుటుంబాన్ని జియోట్యాగింగ్ చేయడం ద్వారా సహాయ చర్యలు సులభమయ్యాయి. గతంలో తుఫాను తర్వాత విద్యుత్ పునరుద్ధరణకు 10 గంటలకుపైగా పట్టేది. కానీ ఈసారి కేవలం 3 గంటల్లోనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించగలిగాం. అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేశారు. ప్రకృతి విపత్తులను ఎవరూ ఆపలేరు కానీ, ముందస్తు చర్యలతో నష్టాన్ని తగ్గించవచ్చు,” అని పేర్కొన్నారు.