Connect with us

Devotional

మేడారం జాతరలో విషాదం.. జంపన్న వాగు వద్ద ప్రాణాంతక ఘటన

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర ప్రారంభంతో అరణ్యప్రాంతం భక్తజనంతో కిటకిటలాడుతోంది.

తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర ప్రారంభంతో అరణ్యప్రాంతం భక్తజనంతో కిటకిటలాడుతోంది. బుధవారం (జనవరి 28) నుంచి జాతర మొదలుకావడంతో రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతరలో విషాదకర ఘటనలు చోటుచేసుకుని భక్తులను కలచివేశాయి.

మేడారం సమీపంలోని జంపన్నవాగు లోనున్న ఒక వ్యక్తి చనిపోయాడు. అతను మంచిర్యాల జిల్లా నుండి వచ్చాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కువ మంది ప్రజలు ఈ ప్రాంతానికి వస్తున్నందున, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదే సమయంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. మేడారం జాతరకు ట్రాక్టర్‌లో వెళ్తున్న తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కస్తూరి లక్ష్మి, ఆమె కుమార్తె కస్తూరి అక్షితగా మృతులను గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు 18 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

పోలీసులు చెప్పిన ప్రకారం ఆసిఫాబాద్‌కు చెందిన తల్లీకూతుళ్లు ముందుగా బొమ్మాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి ట్రాక్టర్‌లో మేడారం జాతరకు బయలుదేరారు. మహాముత్తారం మండలం పెగడపల్లి పెద్దవాగు వద్ద ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. ట్రాక్టర్‌లో మొత్తం 20 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు.

మంత్రి శ్రీధర్ బాబు ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారిని వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరించారు.

ఇదిలా ఉండగా, మేడారం జాతరలో కీలక ఘట్టాలు కొనసాగుతున్నాయి. జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరారు. జనవరి 29న చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క దేవతను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల పూనకాలు, శివసత్తుల విన్యాసాలతో అడవి ప్రాంతం మారుమోగనుంది.

జనవరి 30న భక్తులు సమర్పించే బెల్లం మొక్కులతో గద్దెలు నిండిపోతాయి. జనవరి 31న దేవతల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. ఈ కీలక రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

#Medaram#MedaramJathara#MedaramMahajathara#SammakkaSaralamma#TelanganaDevotional#TempleFestival#DevoteesRush
#JatharaUpdates#TragicIncident#JampannaVagu#TractorAccident#PublicSafety#BreakingNews#TelanganaNews#LatestUpdates

Loading