National
ముంబైలో షాకింగ్ ఘటన – సినిమా ఆడిషన్ పేరుతో 17 పిల్లల కిడ్నాప్, సైకో రోహిత్ ఆర్య పోలీసుల కాల్పుల్లో హతం
ముంబై నగరంలో గురువారం సంచలన ఘటన చోటు చేసుకుంది. సినిమా ఆడిషన్ పేరుతో రోహిత్ ఆర్య అనే వ్యక్తి 17 మంది చిన్నపిల్లలను కిడ్నాప్ చేశాడు. ఈ సంఘటన పోవాయి ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోస్ వద్ద మధ్యాహ్నం 1.45 గంటలకు జరిగింది. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి పిల్లలను ఆడిషన్ కోసం పిలిచి, ఆ తరువాత వారిని బంధించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చర్చలు ప్రారంభించారు.
రోహిత్ ఆర్య పోలీసులకు ముందుగా ఒక వీడియో విడుదల చేసి తాను ఉగ్రవాది కాదని, డబ్బుల కోసం ఈ చర్య చేయలేదని స్పష్టం చేశాడు. తనకు సాధారణ, నైతిక మరియు ధార్మిక ప్రశ్నలపై సమాధానాలు కావాలని తెలిపాడు. తనను ఆత్మహత్య చేసుకోవడం బదులు పిల్లలను బందీలుగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు కూడా వెల్లడించాడు. పోలీసులు ఆరా తీస్తున్న సమయంలో, రోహిత్ పిల్లలను విడిచిపెట్టడానికి నిరాకరించాడు.
చివరికి పోలీసులు బాత్రూమ్ మార్గం ద్వారా భవనంలోకి చొరబడి పిల్లలను సురక్షితంగా రక్షించడానికి ప్రయత్నించారు. అదే సమయంలో రోహిత్ ఎయిర్ గన్తో కాల్పులు జరిపాడు. దీనికి ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపగా రోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మరణించాడు.
సంఘటన అనంతరం పోలీసులు ఎయిర్ గన్, కొన్ని రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ 17 మంది పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజమైన కారణాలు, రోహిత్ ఆర్య మానసిక స్థితి, మరియు అతను ఈ చర్యకు ఎందుకు పాల్పడ్డాడు అనే దానిపై విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటన ముంబై నగరంలో తీవ్ర ఆందోళన రేపింది.
![]()
