Business
మాయా ‘సృష్టి’కర్త ఎవరు? డాక్టర్ నమ్రత అసలేం చేసిందంటే…
హైదరాబాద్‌లోని ప్రముఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేంద్రాన్ని నడుపుతున్న డాక్టర్ నమ్రతపై గతంలోనే పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె సెంటర్‌తో అనేక దంపతులు మానసికంగా, ఆర్థికంగా నష్టపోయారు. ఇటీవలి ఘటనతో మరోసారి ఈ సంస్థ పేరు వార్తల్లోకెక్కింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, డా. నమ్రత రిజిస్ట్రేషన్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 2016లోనే రద్దు చేసింది. అప్పటికే ఆమె పై అనుమానాస్పద కార్యకలాపాలపై ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె 2021లో రిజిస్ట్రేషన్ పునరుద్ధరణకు ప్రయత్నించారు. అయితే అప్పటికల్లా కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటంతో మెడికల్ కౌన్సిల్ ఆ ప్రక్రియను ఆపేసింది. అయినా ఆమె వైద్యరంగంలో కొనసాగుతూ ఫెర్టిలిటీ సెంటర్‌ను నడిపినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. డాక్టర్ నమ్రత పై కేసును సుమోటోగా తీసుకొని విచారణ ప్రారంభించింది. ఇలాంటి నిషేధితులు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలు చేయడం పట్ల కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందించే వారిపై కఠిన చర్యలు తీసుకునే సంకల్పంతో ముందుకెళ్తోంది.