Andhra Pradesh
మహానాడు ముంగిట మాయాజాలం: YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం
అమరావతి (ఆంధ్రప్రదేశ్):
మహానాడు సన్నాహాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వేడి పెరుగుతోంది. అధికార కూటమి తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలను మాయాజాలంగా అభివర్ణిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
‘‘మహానాడు ముంగిట మాయాజూదం. YCP నేతలపై అక్రమ చర్యలు జరగడం చూస్తుంటే, ఇది కూటమి కుట్రే అనేలా ఉంది,’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు, మాజీ మంత్రి సీదిరిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వంటి విషయాలను ఆయన ట్వీట్‌లో ప్రస్తావించారు.
వివరాల్లోకి వెళితే, మైనింగ్ కేసులో వైసీపీ నేత కాకాణిని పోలీస్ శాఖ అరెస్ట్ చేయగా, పల్నాడులో ఇటీవల చోటుచేసుకున్న జంట హత్యల ఘటనపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. మరోవైపు వజ్రపుకొత్తూరులో ఇంటి కూల్చివేతలను అడ్డుకునేందుకు వెళ్లిన మాజీ మంత్రి సీదిరిపై స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ అన్ని ఘటనలూ మహానాడు సమీపిస్తున్న వేళ కావడం కూటమి రాజకీయ ఉద్దేశంతో జరిగాయి అన్న అభిప్రాయం YCP వర్గాల్లో వ్యక్తమవుతోంది.
చంద్రశేఖర్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘‘ప్రజాస్వామ్యంలో విభిన్న వాదనలకు స్థానం ఉండాలి గానీ, ప్రతిపక్ష నేతలపై కుట్రలు, అరెస్టులు జరగటం దుర్మార్గం,’’ అని YCP నేతలు మండిపడుతున్నారు.
ఇక మహానాడు తరువాత రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.