International
మరో తెలుగు అథ్లెట్కు గోల్డ్ మెడల్
ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025లో తెలంగాణకు చెందిన అథ్లెట్ నందిని అగసర మహిళల హెప్టాథ్లాన్ 800 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించి రాష్ట్రానికి గర్వకారణమైంది. సికింద్రాబాద్‌కు చెందిన ఈ యువ అథ్లెట్, చైనాకు చెందిన లియు జింగ్‌యీని వెనక్కి నెట్టి 2:15.54 సెకన్లలో 800 మీటర్ల రేసును పూర్తి చేసి, మొత్తం 885 పాయింట్లతో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 2023 హాంగ్‌జౌ ఏషియన్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన నందిని, ఈ విజయంతో తన సత్తాను మరోసారి నిరూపించుకుంది. ఆమె ఈ విజయం తెలంగాణ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని క్రీడాభిమానులు అభినందిస్తున్నారు.
ఇదే ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ కూడా మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించి తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని పెంచింది. 12.96 సెకన్లలో కొత్త ఛాంపియన్‌షిప్ రికార్డు సృష్టించిన జ్యోతి, గత ఏడాది ఈ ఈవెంట్‌లో గెలిచిన టైటిల్‌ను కాపాడుకుంది. విశాఖపట్నంకు చెందిన ఈ 25 ఏళ్ల అథ్లెట్, రేసు మధ్యలో వెనుకబడినప్పటికీ చివరి నాలుగు హర్డిల్స్‌లో అద్భుత ప్రదర్శనతో ముందుకు దూసుకెళ్లి గోల్డ్ గెలిచింది. ఈ విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహా పలువురు జ్యోతిని అభినందించారు, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.