Business
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌లు – అమెరికాలోనే వివాదం
భారతదేశంపై డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ నిర్ణయం అమెరికాలోనే పెద్ద చర్చనీయాంశమైంది. ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, భారతదేశంపైనే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం అమెరికా–భారత్ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
తాజాగా అమెరికా హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీకి చెందిన డెమోక్రాటిక్ సభ్యులు ట్రంప్‌ను తప్పుపడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చైనా, టర్కీ, ఇతర దేశాలు రష్యా నుంచి ఎక్కువ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటున్నా, వారిపై ట్రంప్ ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భారత్ వంటి వ్యూహాత్మక భాగస్వామిపై మాత్రమే టారిఫ్‌లు విధించడం అమెరికన్ ప్రజలకే నష్టదాయకమని వారు స్పష్టంచేశారు.
డెమోక్రాట్స్ అభిప్రాయం ప్రకారం, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఉక్రెయిన్‌కు మద్దతుగా కనిపించడం లేదని, భౌగోళిక రాజకీయాల్లో తప్పుదారిలో నడిపిస్తోందని అభిప్రాయపడ్డారు. భారత్‌తో ఉన్న ఆర్థిక, రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు అమెరికాకు ఎంత ముఖ్యమో గుర్తుచేస్తూ, ఈ విధానం భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయవచ్చని హెచ్చరించారు. దీంతో ట్రంప్ పాలసీలపై అమెరికా అంతర్గతంగానే గట్టి వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి.