Latest Updates
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసుల మోత
తెలంగాణలో రాజకీయ వేడి ఎక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పలువురు కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలో హైదరాబాద్ బంజారాహిల్స్, రాజేంద్రనగర్, షాద్నగర్ పోలీస్ స్టేషన్లలో ఆయన్ను అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 356(2), 353(B), 352 కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన్ను శాంతిభద్రతలానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక మరోవైపు, ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ యువజన విభాగం ఎన్‌ఎస్‌యూఐ (NSUI) సభ్యులు పెద్ద ఎత్తున నిరసనకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ముట్టడికి పిలుపునిచ్చారు. దీనితో ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మరోసారి చెలరేగింది.