Latest Updates
ప్రధాని నాకు బిగ్ బ్రదర్: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రధానిని తాను పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే విమర్శిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. INDIA TODAY పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు మోదీని పొగిడిన మీరు ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. “ప్రధాని నాకు బిగ్ బ్రదర్. ఆ స్థానంలో ఎవరున్నా సీఎంలందరికీ వారు బిగ్ బ్రదర్ లాంటివారే. ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది” అని తెలిపారు.
రేవంత్ స్పష్టంచేస్తూ.. “ప్రధాని పట్ల నాకు గౌరవం ఉంది. కానీ నా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నేను పోరాడతా. రాష్ట్ర సమస్యల విషయంలో, తెలంగాణ హక్కుల విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించడం నా బాధ్యత” అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని సవాలు చేయడంలో తప్పులేదని రేవంత్ అన్నారు.
అలాగే, 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. “దేశంలో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరుగుతోంది. రాహుల్ గాంధీ నిజమైన నాయకత్వాన్ని చూపించగలరు. ఆ సమయం రాబోతుంది” అని రేవంత్ పేర్కొన్నారు.