Andhra Pradesh
పైరసీ ముఠాపై సజ్జనార్ చర్యలకు పవన్ కళ్యాణ్ అభినందనలు
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లైన ఐబొమ్మ, బప్పమ్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసుల చర్యను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. పోలీసుల కఠిన చర్య వల్ల సినీ పరిశ్రమకు ఎంతో ఉపశమనం లభించిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల కష్టపడి సంపాదించిన డబ్బుతో నిర్మించిన సినిమాలను విడుదల రోజు నుంచే దోచుకునే ముఠాలను అరికట్టడం అత్యవసరమని పవన్ తెలిపారు.
తాజాగా హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను పలువురు సినీ ప్రముఖులు కలిసి పైరసీ నివారణ చర్యలపై చర్చించిన విషయం తెలిసిందే. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు లు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలకు సినీ పరిశ్రమ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్స్ లో స్పందిస్తూ తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశంసించారు.
సృజనాత్మకత, కష్టపాటు, పెట్టుబడులతో తెరకెక్కించే సినిమాలు పైరసీ ముఠాల వలలో పడిపోవడం ఎంతో బాధాకరమని పవన్ తెలిపారు. అధికారులకు సవాల్ విసిరేంత ధైర్యంగా మారిన ఈ నెట్వర్క్‌ను ఒక్క దెబ్బకే కూలదోసిన హైదరాబాద్ సైబర్ క్రైం బృందపు ఆపరేషన్ ప్రశంసనీయం అన్నారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్స్, పొంజీ స్కీమ్స్‌పై కూడా సజ్జనార్ స్వయంగా తీసుకుంటున్న కఠిన చర్యలను పవన్ గుర్తు చేశారు.
సజ్జనార్ నాయకత్వంలో జరుగుతున్న ఈ చర్యలు కేవలం తెలుగు పరిశ్రమకే కాకుండా మొత్తం భారతీయ సినీ రంగానికి మేలు చేస్తాయని పవన్ అన్నారు. ప్రజలను మోసం చేసే అనేక అక్రమ కార్యకలాపాలపై సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమాలు కూడా సమాజానికి ఉపయోగకరమని వ్యాఖ్యానించారు. పైరసీని పూర్తిగా నిర్మూలించడానికి ఇంకా కఠిన చర్యలు కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
![]()
