Latest Updates
పెళ్లికాని ప్రసాదులు? జర జాగ్రత్త!
హైదరాబాద్ నగరంలో పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకుని కొత్త రకాల మోసాలు పెరుగుతున్నాయి. డేటింగ్ యాప్‌లు, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలలో పరిచయం అవుతున్న యువతులు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తూ ఉచ్చులు వేస్తున్నారు. ముఖ్యంగా “న్యూడ్ వీడియో కాల్” పేరుతో డబ్బులు వసూలు చేస్తూ, సింగిల్స్ బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు.
ప్రతీ కాల్‌కి రూ.500 నుంచి రూ.2,000 వరకు వసూలు చేస్తూ, కేవలం 10 నిమిషాల వీడియో చాట్‌తోనే లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు. అంతేకాక, “హోటల్ గదులు బుక్ చేస్తాం, మీకు వస్తాం” అంటూ మోసగాళ్లు ముందే అడ్వాన్స్ డబ్బులు తీసుకుని, తర్వాత హ్యాండ్ ఇస్తున్నారు. తమ ప్రలోభాలకు సింగిల్స్ లోబడి డబ్బులు చెల్లిస్తే, తిరిగి మోసపోయామన్న విషయాన్ని బయటపెట్టడానికి సిగ్గుపడుతుండటంతో, కేసులు బయటికి రావడం చాలా అరుదుగా మారింది.
సైబర్ క్రైమ్ పోలీసులు యువకులను అప్రమత్తం చేస్తూ, ఇలాంటి ఆఫర్లకు లొంగిపోకూడదని హెచ్చరిస్తున్నారు. డబ్బు అడిగే వీడియో కాల్స్, హోటల్ రూమ్ బుకింగ్స్ పేరుతో వచ్చే మెసేజ్‌లన్నీ మోసపూరితమని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు యువకులు లక్షల రూపాయలు కోల్పోయారని, ఇలాంటి మోసాలకు బలి కాకుండా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.