Andhra Pradesh
పెరుగుతున్న వరద.. ప్రజలకు అప్రమత్తం కావాలంటున్న APSDMA
ఆంధ్రప్రదేశ్‌లో వరద పరిస్థితులు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం భారీగా పెరుగుతోందని హెచ్చరించింది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 2.54 లక్షల క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వరద ముప్పు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నదిలో పంట్లు లేదా నాటు పడవలతో ప్రయాణించకూడదని APSDMA హెచ్చరించింది. అలాగే ప్రజలు అనవసరంగా నదికి వెళ్లి చేపలు పట్టడం, ఈతకు దిగడం వంటి పనులకు దూరంగా ఉండాలని పేర్కొంది. వరద ఉధృతి ఉన్న వేళ ఈ చర్యలు ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు.
తీవ్ర అవసరమైతే వెంటనే సహాయక నంబర్లను సంప్రదించాలంటూ అధికారులు సూచించారు. ఇందుకు సంబంధించి APSDMA 1070, 112, 1800-425-0101 వంటి టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. ప్రజలందరూ తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు పునరుద్ఘాటించారు.