Health

పునర్విక కోసం ప్రజల పోరాటం: ప్రభుత్వ నిధులున్నా పసి ప్రాణాలకు తప్పని తిప్పలు!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా #SavePunarvika నినాదమే వినిపిస్తోంది. కర్నూలుకు చెందిన ఈ చిన్నారి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధితో పోరాడుతోంది. పాప ప్రాణాలు నిలవాలంటే రూ.16 కోట్ల విలువైన జోల్‌జెన్‌స్మా ఇంజెక్షన్ అవసరమని వైద్యులు చెబుతున్నారు. అంత పెద్ద మొత్తాన్ని సామాన్య కుటుంబం భరించలేక పోవడంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సామాన్య ప్రజలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు.

ఒకవైపు పసిపాప ప్రాణం కోసం ప్రజలు రోడ్ల మీదకు వచ్చి చిల్లర పైసలు వసూలు చేస్తుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం వద్ద అరుదైన వ్యాధుల చికిత్స కోసం కేటాయించిన నిధులు వాడకం లేక మురిగిపోతున్నాయి,నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ (NPRD) కింద 2025-26 బడ్జెట్‌లో రూ. 300 కోట్లు కేటాయించగా, గత ఏడాది డిసెంబర్ నాటికి కేవలం రూ. 30 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. మిగతా రూ. 270 కోట్లు మార్చి 31లోగా ఖర్చు చేయకపోతే అవి వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.

 అరుదైన వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వం గరిష్టంగా రూ. 50 లక్షలు మాత్రమే సాయం చేస్తుంది. కానీ పునర్విక లాంటి చిన్నారుల చికిత్సకు కోట్లాది రూపాయలు అవసరం. ఈ పరిమితి కారణంగా పూర్తిస్థాయి వైద్యం అందడం లేదు,నిధులు మంజూరు కావాలంటే ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (హైదరాబాద్‌లోని నిమ్స్ వంటివి) ద్వారా సుదీర్ఘ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. నిధులు కేటాయించినా విడుదలలో జాప్యం జరుగుతుండటంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని, రూ. 50 లక్షల పరిమితిని సవరించి పునర్విక లాంటి చిన్నారుల ప్రాణాలు కాపాడటానికి వాడుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. నిధులు మంజూరైనా అవి అవసరమైన వారికి చేరకపోవడం పాలనాపరమైన వైఫల్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version