International
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై ట్రోల్స్ వర్షం
చైనాలోని టియాన్జన్‌లో జరిగిన సమావేశంలో మరోసారి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రోల్స్ బారిన పడ్డారు. ప్రధాన వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్సాహంగా మాట్లాడుతూ, స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు సాగించగా, షెహబాజ్ షరీఫ్ మాత్రం వారిద్దరి వెనుకవైపు సెక్యూరిటీ గార్డులా నిలబడ్డారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు విపరీతంగా వ్యంగ్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
నెటిజన్ల దృష్టిలో మోదీ–పుతిన్ కలయిక ప్రధాన ఆకర్షణ కాగా, షెహబాజ్ షరీఫ్ పూర్తిగా పక్కనపడిపోయారని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. “ఇద్దరు పెద్దలు సీరియస్‌గా మాట్లాడుకుంటుంటే, వెనక ఎవరో బాడీగార్డు లా నిలబడ్డారు” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. భారత్–రష్యా దేశాధినేతల మధ్య ఉన్న స్నేహం, ఆప్యాయత చూసి పాక్ ప్రధానికి అసహనం కలిగిందని, ఆ క్షణం ఆయనకు అసౌకర్యంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అంతర్జాతీయ వేదికలపై షెహబాజ్ షరీఫ్ పక్కన పెట్టబడ్డారని విమర్శలు వచ్చాయి. కేవలం నిన్నే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పుతిన్ కలిసి నడుస్తూ షరీఫ్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు మోదీ–పుతిన్ చర్చల వెనుక నిలబడిన ఫోటోలు బయటకు రావడంతో, పాక్ ప్రధాని మళ్లీ ట్రోల్స్‌కు గురవుతున్నారు. ఇది పాకిస్థాన్ దౌత్య వైఫల్యానికి మరో ఉదాహరణగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.