International
నేపాల్ వాదనను ఖండించిన భారత్
భారత్ – నేపాల్ మధ్య సరిహద్దు వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. లింపియాధుర, లిపులేఖ్, కాలాపాణి ప్రాంతాలు తమ భూభాగమని నేపాల్ వాదిస్తుండగా, భారత్ దీనిని ఖండించింది. భారత్ స్పష్టంగా చెప్పింది – “లిపులేఖ్ ద్వారా భారత్–చైనా వాణిజ్యం 1953లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఇరుదేశాలు కలిసి వాణిజ్యాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ విషయంలో నేపాల్ అభ్యంతరాలు చెప్పడం తగదు” అని.
భారత్–చైనా వాణిజ్య పునరుద్ధరణ నిర్ణయం నేపాల్‌కు అసహనం కలిగించింది. లిపులేఖ్ కారిడార్‌ను ఉపయోగించుకోవడం ద్వారా రెండు దేశాలు ఆర్థిక సంబంధాలను బలపరచుకోవాలని ముందుకు వెళ్తుండగా, నేపాల్ మాత్రం దీనిని తమ సార్వభౌమత్వానికి విఘాతం అని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే భారత్ మాత్రం ఆ ప్రాంతం తమ నియంత్రణలోనే ఉందని, వాణిజ్య మార్గంపై మూడో దేశానికి అభ్యంతర హక్కు ఉండదని స్పష్టం చేసింది.
ఇక, భారత్–చైనా సంబంధాల ప్రాధాన్యం నేపాల్ వాదనలను మరుగున పడేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సరిహద్దు ఉద్రిక్తతలతో ఇరుదేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు రెండు దేశాలు వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడమే ముఖ్యమని నిర్ణయించుకున్నాయి. ఈ పరిణామం నేపాల్‌కు నిరాశ కలిగించినా, భారత్ మాత్రం తన స్థానం నుంచి వెనక్కి తగ్గే అవకాశం లేదని సూచిస్తోంది.