Andhra Pradesh
నెలలో 15 రోజులు రెండు పూటలా రేషన్ దుకాణాలు: పవన్
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రూ.1600 కోట్ల వ్యయంతో రేషన్ వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రజలకు సరుకులు సకాలంలో అందక ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక, రోజువారీ పనులు, చిరుద్యోగాలకు సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ప్రజల సౌకర్యం కోసం కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇకపై రేషన్ దుకాణాలు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు రేషన్ సరుకులు తీసుకోవచ్చని ఆయన ట్వీట్‌లో తెలిపారు. ఈ కొత్త విధానంతో ప్రజలకు రేషన్ సరుకులు సులభంగా, సమయానుకూలంగా అందుతాయని, రోజువారీ జీవనంలో ఇబ్బందులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.