Entertainment
నిఖిల్ సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం: వాటర్ ట్యాంక్ పగిలి నీరు ముంచెత్తింది
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ‘ది ఇండియన్ హౌస్’ సినిమా షూటింగ్ సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలో సముద్ర దృశ్యాలను చిత్రీకరించేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పగిలిపోవడంతో షూటింగ్ లొకేషన్ మొత్తం నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో కెమెరాలు, లైటింగ్ యూనిట్లు సహా ఇతర షూటింగ్ సామగ్రి నీటమునిగి భారీగా నష్టపోయినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలైనట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు సిబ్బందిలో మరికొందరికి కూడా గాయాలు కాగా, వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద కారణాలపై ఇంకా స్పష్టత రాకపోగా, సినిమా యూనిట్ ఈ ఘటనతో షాక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన సినిమా షూటింగ్ షెడ్యూల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.