Latest Updates
నాగోల్ బండ్లగూడలో నేడు ఫ్లాట్లకు లక్కీ డ్రా
నాగోల్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మితమైన 1BHK, 2BHK, 3BHK ఫ్లాట్లను లాటరీ విధానంలో కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమం నేడు (మంగళవారం) జరుగనున్నట్లు గృహ నిర్మాణ సంస్థ అధికారులు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు లక్కీ డ్రాలో పాల్గొననున్నారు.
లక్కీ డ్రా ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకుల సమక్షంలో లక్కీ డ్రా జరుగనుంది. లక్కీ డ్రాలో ఎంపికైన విజేతలకు తక్షణమే ఫ్లాట్ కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇంటి కల నెరవేరుతుందనే ఆశతో పలువురు అభ్యర్థులు ముందస్తుగానే వేదిక వద్దకు చేరుకుంటున్నారు.
ఈ లక్కీ డ్రా కార్యక్రమం నేపథ్యంలో బండ్లగూడ రాజీవ్ స్వగృహ వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. వేలాది మంది ప్రజలు తమ పేర్లు డ్రాలో ఉంటాయో లేదో అన్న ఉత్కంఠతో గేట్ల వద్ద వేచి చూస్తున్నారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే అవకాశమని భావిస్తూ మహిళలు, వృద్ధులు, యువతులు, కుటుంబాలతో హాజరై భారీగా తరలివచ్చారు. స్థానిక పోలీసు శాఖ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంది.