Entertainment
నటుడు గోవిందా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్: “నేను ఇప్పుడు బాగున్నాను”
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా (61) ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని బుధవారం (నవంబర్ 12) ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
గోవిందా మంగళవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ముంబైలోని జుహు క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చేరడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగింది. సోషల్ మీడియాలో #GetWellSoonGovinda అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది.
వైద్యుల చికిత్స అనంతరం గోవిందా వేగంగా కోలుకున్నారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన మీడియాతో మాట్లాడారు.
గోవిందా ఏమన్నారంటే: “నేను ఇప్పుడు పూర్తిగా బాగున్నాను.” “గత కొన్ని వారాలుగా వరుసగా షూటింగ్‌లు, ప్రమోషన్‌లలో పాల్గొనడం, అలాగే జిమ్‌లో ఎక్కువగా వర్కౌట్ చేయడం వల్ల అలసట, డీహైడ్రేషన్ అయ్యింది. దాంతోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాను.” “ఇకపై నా శరీరాన్ని బలవంతం చేయకుండా, యోగ, ప్రాణాయామం, ధ్యానం పట్ల ఎక్కువ దృష్టి పెడతాను. మనస్సుకు శాంతిని ఇచ్చే మార్గాలను అనుసరించబోతున్నాను.” తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
వైద్యులు సూచన మేరకు గోవిందా కొన్ని రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆయన ఆరోగ్యంగా డిశ్చార్జ్ కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 1990లలో తన కామెడీ, డ్యాన్సులతో గోవిందా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.
![]()
