Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు: ప్రజలు ఇబ్బందుల్లో
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా వాన కురుస్తుండటంతో, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వర్షం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
ఇదే తరహాలో తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గాలీవానలతో కూడిన వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోతుండటంతో ప్రజల జీవితం స్థంభించిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. కొన్నిచోట్ల రహదారులు తెగిపోవడంతో ట్రాన్స్‌పోర్ట్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.