Telangana
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు స్టే – జీవో నం.9పై తాత్కాలిక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది.
ఈ జీవోపై పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. పిటిషనర్ల వాదనలో, ప్రభుత్వం రిజర్వేషన్ కేటాయింపులో న్యాయం చేయలేదని, కొన్ని వర్గాలకు అనుకూలంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం, న్యాయస్థానం జీవోపై అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఈరోజు విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలనీ, పిటిషనర్లకు అభ్యంతరాలు తెలపేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
ఈ తీర్పుతో ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. ఎన్నికల కమిషన్, కోర్టు ఉత్తర్వుల కాపీ వచ్చిన తర్వాతే తదుపరి ప్రక్రియపై నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ పరిణామం స్థానిక రాజకీయ వర్గాల్లో వివాదాలకు దారి తీస్తోంది.