Connect with us

Politics

తెలంగాణ కేబినెట్ విస్తరణలో అజారుద్దీన్ సర్‌ప్రైజ్.. జూబ్లీహిల్స్ పోలింగ్ ముందు కీలక నిర్ణయం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టనున్న దృశ్యం

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం త్వరలో కేబినెట్ విస్తరణకు సిద్ధమవుతోంది. ఎల్లుండి (శుక్రవారం) కొత్త మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ టీమిండియా కెప్టెన్ మరియు కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్స్ సమీపిస్తున్న వేళ ఈ నిర్ణయం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొనగా, ముస్లిం ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, కేబినెట్‌లో చోటు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ముస్లిం మంత్రి లేకపోవడం విమర్శలకు కారణం అవుతుండగా, ఈ నియామకం ఆ లోటును భర్తీ చేయనుంది.

అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వర్గాలు ఈ వార్తను ధృవీకరిస్తున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్స్ ముందు ఈ ప్రకటన రావడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద బూస్ట్‌గా మారనుంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుండగా, 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ బైపోల్ జరుగుతోంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. ఇలాంటి సున్నిత సమయాన అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా ముస్లిం ఓటర్లను ఆకర్షించడమే కాకుండా, హైదరాబాద్ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Loading