)
హైదరాబాద్ నగరంపై మేఘాలు కమ్ముకొని వర్షం దంచికొడుతోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఉప్పల్, రాజేంద్రనగర్, యూసఫ్ గూడ, అమీర్‌పేట్, జూబ్లీ హిల్స్, ఎల్బీనగర్, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరుసగా పడి వచ్చే వర్షాలతో రోడ్లు జలమయమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్‌లు, లోతట్టు ప్రాంతాల్లో నీటి ముంపు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. వచ్చే 2-3 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం తీవ్రతను బట్టి బయటకు వెళ్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.