Andhra Pradesh
తిరుమల భక్తులకు శుభవార్త: కోరుట్ల–జగిత్యాల స్టేషన్లలో తిరుపతి రైళ్లకు హాల్టింగ్ సదుపాయం
కరీంనగర్ జిల్లాలోని భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఎంతో సంతోషకరమైన వార్తను అందించింది. తిరుపతికి వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం కోరుట్ల మరియు జగిత్యాల (లింగంపేట) రైల్వే స్టేషన్లలో పలు రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్ సదుపాయం కల్పించింది. ఈ నిర్ణయం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఇకపై దూర ప్రాంతాల స్టేషన్లకు వెళ్లాల్సిన తిప్పలు తప్పి, శ్రీవారి దర్శనం ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
ఇప్పటికే జగిత్యాల స్టేషన్‌లో ఒక తిరుపతి రైలు ఆగుతుండగా, తాజా నిర్ణయంతో కోరుట్ల స్టేషన్‌కూ అదే అవకాశం లభించింది. రెండు స్టేషన్లలోనూ రైళ్లు రెండు నిమిషాలపాటు నిలిచేలా అధికారులుచర్యలు తీసుకున్నారు. ఈ హాల్టింగ్ వలన కరీంనగర్ ఉత్తర ప్రాంత ప్రజలు తిరుమలకు చేరేందుకు అవసరమైన ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.
నాందేడ్–ధర్మవరంరైలు (07189) ప్రతి శుక్రవారం నాందేడ్ నుండి బయలుదేరి రాత్రి కోరుట్లలో 7.28–7.30, జగిత్యాలలో 7.58–8.00 వరకు నిలుస్తుంది. ధర్మవరం నుంచి నాందేడ్ వెళ్లే రైలు (07190) ప్రతి ఆదివారం బయలుదేరి, సోమవారం తెల్లవారు జామున జగిత్యాల, కోరుట్ల స్టేషన్లలో ఆగుతుంది. ఇలా ప్రయాణికుల రాకపోకలకు అనుకూలంగా రైళ్ల సమయాలు ఏర్పాటు చేశారు.
అలాగే నాందేడ్–తిరుచానూరు (07015), తిరుచానూర్–నాందేడ్ (07016) రైళ్లు కూడా కోరుట్ల, జగిత్యాల స్టేషన్లలో తాత్కాలిక హాల్టింగ్ పొందాయి. కోరుట్ల మరియు జగిత్యాల్లో రాత్రి, ఉదయం సమయాలలో ఈ రైళ్లు ఆగుతాయి. రైల్వే శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, రైళ్ల సమయాలను ముందుగానే గమనించి మీ ప్రయాణాల్ని ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ఈ నిర్ణడం వల్ల తిరుమల దర్శనం ప్రయాణం నిజంగా ఎంతో సులభతరం కానుంది.
![]()
