తిరుపతిలో మరోసారి చిరుత సంచారం భయాందోళనలు రేపుతోంది. శనివారం రాత్రి జూ పార్క్ రోడ్డులో బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిపై చిరుత అకస్మాత్తుగా దాడికి యత్నించింది. అయితే బైక్ వేగంగా ఉండడంతో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఆ వెంటనే చిరుత వెంటపడకుండా వెంటనే అడవిలోకి పరుగుతీసింది. ఈ తాత్కాలిక ఘటన వెనుక నుంచి వస్తున్న కారులో డాష్‌కామ్‌లో రికార్డ్ కావడం స్థానికులను మరింత అప్రమత్తం చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అదే రాత్రి 12 గంటల సమయంలో అరవింద్ ఆసుపత్రి వద్ద కూడా చిరుత కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ శాఖ అధికారులు, పోలీసులు కలిసి అప్రమత్తమయ్యారు. చిరుత జాడలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలు, క్యామెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. తిరుపతిలో తరచూ చిరుతల సంచారం కనిపించడం స్థానిక ప్రజల్లో భయాన్ని పెంచుతోంది. జూ పార్క్ సమీప ప్రాంతాల ప్రజలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.