Business

తగ్గిన సబ్బులు, షాంపూల ధరలు

GST సవరణల ప్రభావం వినియోగదారులకు నేరుగా చేరింది. దేశంలో అగ్రగామి FMCG కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తమ ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. సబ్బులు, షాంపూలు, పేస్టులు వంటి రోజువారీ వినియోగ ఉత్పత్తుల ధరలు తగ్గడం వినియోగదారులకు కొంత ఊరటను కలిగిస్తోంది. తాజాగా విడుదల చేసిన ధరల జాబితా ప్రకారం, ఈ మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ జాబితాలో ప్రధానంగా డవ్, లైఫ్బాయ్, లక్స్ వంటి ప్రముఖ బ్రాండ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ఉదాహరణకు, 340 మిల్లీ లీటర్ల డవ్ షాంపూ గతంలో రూ.490 ఉండగా, ఇప్పుడు రూ.435కే లభించనుంది. అదేవిధంగా 200 గ్రాముల లైఫ్బాయ్ సబ్బు రూ.130 నుంచి రూ.110కి తగ్గింది. రోజువారీగా ఎక్కువగా వినియోగించే ఉత్పత్తులపై ఈ తగ్గింపు రావడం వల్ల సాధారణ కుటుంబాల ఖర్చులు తగ్గుతాయి.

సబ్బుల విభాగంలో కూడా బాగానే మార్పులు చోటు చేసుకున్నాయి. 75 గ్రాముల లైఫ్బాయ్ నాలుగు సబ్బుల ప్యాక్ రూ.68 బదులు రూ.60కి లభించనుంది. లక్స్ సబ్బుల ధరల్లో కూడా తగ్గింపులు జరిగాయి – 75 గ్రాముల 4 ప్యాక్ రూ.96 నుంచి తక్కువకు వచ్చాయి. అదేవిధంగా 300 గ్రాముల లక్స్ రూ.284, 124 గ్రాముల లక్స్ రూ.110గా లభించనున్నాయి. ఈ ధరలు తగ్గడంతో గ్రామీణ ప్రాంతాల్లో FMCG మార్కెట్ మరింత బలపడే అవకాశముంది.

పేస్టుల విభాగంలో కూడా HUL ధరలు తగ్గించింది. క్లోజప్ 150 గ్రాముల పేస్ట్ గతంలో రూ.154 ఉండగా, ఇప్పుడు రూ.129కే లభించనుంది. ఈ తగ్గింపు వల్ల వినియోగదారులు మరింత లాభపడతారని అంచనా. మొత్తంగా GST మార్పుల నేపథ్యంలో FMCG ఉత్పత్తుల ధరలు తగ్గడం మార్కెట్‌లో పోటీని మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. వినియోగదారుల ఖర్చు తగ్గి, డిమాండ్ పెరగడం FMCG రంగానికి కొత్త ఊపు తీసుకువస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version