International
ట్రంప్-పుతిన్ భేటీపై జెలెన్స్కీ ఫస్ట్ రియాక్షన్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న రాత్రి అలాస్కాలో భేటీ అయిన సంగతి తెలిసిందే. యుద్ధం ముగింపు దిశగా చర్చలు సాగిన ఈ సమావేశం అంతర్జాతీయ వేదికపై ఆసక్తిని రేకెత్తించింది. ఈ భేటీపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తొలిసారి స్పందించారు.
జెలెన్స్కీ ప్రకటన ప్రకారం, భేటీ అనంతరం ట్రంప్ తనకు ఫోన్ చేసి, పుతిన్‌తో జరిగిన చర్చల విషయాలను వివరించారని తెలిపారు. ఉక్రెయిన్ భవిష్యత్తు, యుద్ధ పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై తనను కూడా భాగస్వామ్యుడిగా పరిగణిస్తున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రాబోయే చర్చల్లో తానూ పాల్గొనాలని ట్రంప్ ఆహ్వానించినట్లు వెల్లడించారు.
ఇక యుద్ధం కారణంగా వేలాది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, మరణాలు ఆపడం, శాంతి సాధించడం అత్యవసరమని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో సోమవారం వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడితో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు ప్రకటించారు. ఈ భేటీ ద్వారానే రష్యా–ఉక్రెయిన్ యుద్ధ భవిష్యత్తుపై స్పష్టత రానుందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.