Business
టారిఫ్స్ ప్రభావం – LPUలో అమెరికన్ డ్రింక్స్‌పై నిషేధం
భారతదేశంపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లకు ప్రతీకారంగా పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ ఛాన్సలర్, ఆప్ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించిన ప్రకారం, ఇకపై యూనివర్సిటీ అన్ని క్యాంపస్లలో అమెరికన్ సాఫ్ట్ డ్రింక్స్ అమ్మకాన్ని నిషేధించారు. ఇది కేవలం ఒక యూనివర్సిటీ స్థాయిలో తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, దేశ గౌరవాన్ని కాపాడే దిశగా ఇచ్చిన కఠినమైన సందేశమని ఆయన వివరించారు.
ఈ నిషేధంపై మాట్లాడుతూ మిట్టల్ స్పష్టం చేశారు – భారత్‌పై అన్యాయంగా పన్నులు విధిస్తే, మనం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండబోమని అమెరికాకు ఈ చర్యతో బలమైన సందేశం ఇస్తున్నామన్నారు. “ఇండియా ఎవరికీ తలొంచదు, తలవంచదు” అనే నినాదాన్ని ముందుకు తెచ్చుకుంటూ, దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
గతంలోనే డాక్టర్ మిట్టల్ హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 27లోగా అమెరికా ఈ టారిఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, భారతదేశంలో అమెరికా ఉత్పత్తులపై పూర్తిస్థాయి నిషేధానికి వేదిక సిద్ధమవుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు LPU తీసుకున్న ఈ నిర్ణయం, ఆ హెచ్చరికలకు ఆరంభమని భావిస్తున్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ అమెరికన్ ఉత్పత్తులను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.