Sports
జనవరిలో దేశవాళీ క్రికెట్ రచ్చ.. విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా స్టార్స్

కొత్త ఏడాదిలో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ ఈసారి స్టార్ పవర్‌తో మరింత ఆకర్షణీయంగా మారనుంది. టీమిండియా ప్రధాన ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తమ రాష్ట్ర జట్ల తరఫున దేశవాళీ వన్డే టోర్నీలో ఆడనున్నారు. ఈ విషయం క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. బీసీసీఐ అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం జాతీయ జట్టులోని ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి కావడంతో ఈ స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.
జనవరిలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు ఈ టోర్నీని ప్రాక్టీస్ వేదికగా మార్చుకోవాలని టీమిండియా ప్లేయర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్ జనవరి 3, 6 తేదీల్లో సిక్కిం, గోవా జట్లతో జరిగే మ్యాచ్‌ల్లో ఆడనున్నారు. జైపూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ల తర్వాత గిల్ జాతీయ జట్టుతో చేరనున్నాడు. ప్రస్తుతం పంజాబ్ గ్రూప్ సీలో నాలుగో స్థానంలో ఉంది.
సౌరాష్ట్ర తరఫున రవీండ్ర జడేజా జనవరి 6, 8 తేదీల్లో సర్వీసెస్, గుజరాత్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో పాల్గొంటున్నారు. ఆలూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ల్లో సౌరాష్ట్ర ఇప్పటివరకు ఒకే ఒక్క విజయం సాధించి ఆరో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ జట్టు కూడా ఉంది.
కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్ ఆడే మ్యాచ్‌లపై అధికారిక ప్రకటన రాకపోయినా, జనవరి 3, 6 తేదీల్లో త్రిపుర, రాజస్థాన్ జట్లతో జరిగే మ్యాచ్‌ల్లో అతడు బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ల్లో కర్ణాటక ఇప్పటివరకు అన్ని మ్యాచ్‌లు గెలిచి గ్రూప్ లో రెండో స్థానంలో ఉంది.
ముంబై తరఫున యశస్వి జైస్వాల్ కూడా టోర్నీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. అనారోగ్య కారణాలతో తొలి మ్యాచ్‌లకు దూరమైన జైస్వాల్, గోవాతో జరిగే మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది. ముంబై ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ వంటి అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. దీంతో విజయ్ హజారే ట్రోఫీపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే, పనిభారం తగ్గించే ఉద్దేశంతో జస్ప్రీత్ బుమ్రాకు ఈ టోర్నీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ జనవరి 6న మరో మ్యాచ్ ఆడనున్నారు, రిషభ్ పంత్ మాత్రం టోర్నీ మొత్తం ఢిల్లీ తరఫున ఆడతానని ప్రకటించాడు.
#TeamIndia#ShubmanGill#KLRahul#RavindraJadeja#ViratKohli#RohitSharma#RishabhPant#DomesticCricket#IndianCricket