Andhra Pradesh
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: “సంస్కరణలు చేసినందుకే అధికారం కోల్పోయాం”
ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రత్యేక వనరులను వినియోగించుకుని, హరిత శక్తి రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని SRM యూనివర్శిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఏ ఇతర రాష్ట్రానికి లేని వనరులు మనకు ఉన్నాయి. విద్యుత్ రంగ సంస్కరణలు నేనే మొదలుపెట్టాను. కానీ అవే సంస్కరణలు తీసుకురావడం వల్ల 2004లో అధికారాన్ని కోల్పోయాను,” అని చంద్రబాబు చెప్పారు. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ ఉత్పత్తి, నిల్వలపై రాష్ట్రం దృష్టి పెట్టిందని తెలిపారు.
గ్రీన్ హైడ్రోజన్ విప్లవానికి తెరలేపే విధంగా “గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ” స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు చంద్రబాబు వెల్లడించారు. హరిత శక్తిని ఆదా చేసి, నిల్వ చేసేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. ఈ రంగంలో పరిశోధన, పెట్టుబడులకు రాష్ట్రం అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని తెలిపారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.