Andhra Pradesh
చంద్రబాబును సంప్రదించలేదు: సీఎం రేవంత్
హైదరాబాద్: 2024 ఎన్నికల తర్వాత ఇండీ కూటమికి మద్దతు కోరుతూ తాను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును సంప్రదించారన్న వార్తలు అవాస్తవమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండియా టుడే పాడ్కాస్ట్‌లో మాట్లాడుతూ, అలాంటి ప్రయత్నం తాను ఎప్పుడూ చేయలేదని, ఆ ప్రచారం వాస్తవం కాదని ఖండించారు.
రాహుల్ గాంధీ రాజకీయాల్లో ఇలాంటి బ్యాక్‌డోర్ చర్చలను ఇష్టపడరని, కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఆ రకమైన ప్రయత్నాలు జరగలేదని రేవంత్ అన్నారు. “చంద్రబాబును సంప్రదించానని వస్తున్న వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవు. అవి పూర్తిగా కల్పితమే” అని స్పష్టం చేశారు.
అయితే చంద్రబాబుపై తన గౌరవాన్ని వ్యక్తం చేస్తూ రేవంత్ మాట్లాడుతూ, “ఆయన సీనియర్ పొలిటీషియన్. గతంలోనూ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాజకీయ ఎత్తుగడల్లో ఆయన్ను మించినవారు లేరు” అని ప్రశంసించారు. కానీ ఈ సందర్భంలో తనకు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పాత్ర లేదని మరోసారి తేల్చిచెప్పారు.