Andhra Pradesh
గోదావరి పుష్కరాలకు భారీ ప్రణాళికలు – యాత్రికుల కోసం ప్రత్యేక చర్యలు అమలు..!!
గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. 2027 జూన్‌లో ప్రారంభమయ్యే పుష్కరాలకు ముందుగానే ప్రణాళికలు రూపొందించి, ఈసారి ఉత్సవాలను కుంభమేళా స్థాయి వైభవంతో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో సుమారు రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తూ ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించారు.
ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో దాదాపు 500కు పైగా ఘాట్లను సిద్ధం చేయాలని అధికారులు యోచిస్తున్నరు. పాత ఘాట్ల పరిస్థితిని వెంటనే పరిశీలించాలనీ, అవసరమైతే కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఘాట్ నిర్మాణ పనులకు టెండర్లు కూడా త్వరలోనే పిలవనున్నారు.
గతంలో 2015 లో 4.5 కోట్ల మంది స్నానాలు ఆచరించగా, ఈసారి 10 కోట్లకు పైగా భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని రవాణా సౌకర్యాలను కూడా పెంచుతున్నారు. భక్తుల కోసం 5 వేల బస్సులు మరియు 2,800 రైళ్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
టెంట్ సిటీలు, అదనపు పుష్కర ఘాట్లు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా మెడికల్ సదుపాయాలు వంటి కీలక ఏర్పాట్లను కూడా ప్రణాళికలో చేర్చారు. మొత్తం ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీ, ఉన్నతాధికారుల బృందం, అలాగే ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
#GodavariPushkaralu2027 #PushkaraArrangements #APGovernment #GodavariGhats #Pushkarams #DevoteesRush #AndhraPradeshNews #TentCity #FestivalPreparation #GodavariUpdates #SpiritualEvents #APTourism #MegaArrangements
![]()
