Andhra Pradesh
గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ఏనుగుల బీభత్సం: గిరిజనుల్లో భయాందోళన
పార్వతీపురంమన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల బీభత్సం స్థానిక గిరిజన రైతులను కలచివేస్తోంది. అటవీ ప్రాంతాల నుంచి గ్రామాలవైపు వచ్చి కొన్ని ఏనుగులు ఓ గిరిజన రైతు పొలంలోకి ప్రవేశించాయి. ఆ రైతు సాగుచేసిన అరటి తోట, బొప్పాయి పంటలను పూర్తిగా నాశనం చేశాయి. అంతే కాకుండా, వ్యవసాయ పనులకు ఉపయోగించే తాత్కాలిక రేకుల షెడ్‌ను కూడా ధ్వంసం చేశాయి.
ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఏనుగులు మళ్లీ రాత్రిపూట దాడికి వచ్చే ప్రమాదం ఉందన్న భయంతో గిరిజనులు రాత్రింబవళ్లు అప్రమత్తంగా గడుపుతున్నారు. తమ ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనతో కొంతమంది ఇతర ప్రాంతాలకు తాత్కాలికంగా వెళ్లిపోయినట్లు సమాచారం.
అటవీ శాఖ అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంటలు నాశనమయ్యేంతవరకూ ఏనుగుల పయనం గుర్తించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా ఏనుగుల కదలికలు ఉండటంతో స్థానికులు పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. తగిన చర్యలు తీసుకొని ఏనుగులను అటవీ ప్రాంతాలకు తరలించాలని గిరిజన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.