Andhra Pradesh
గత ఏడాది నుంచి దేశంలో తొక్కిసలాట విషాదాలు: 6 ఘటనల్లో 175 మంది మృతి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా జరిగిన తొక్కిసలాట విషాదాలను మరోసారి గుర్తు చేసింది. 2024 జులై నుంచి 2025 మే వరకు ఆరు ప్రధాన తొక్కిసలాట ఘటనల్లో సుమారు 175 మంది మరణించారు. ఈ ఘటనలు భారీ జనసమూహ నిర్వహణలో లోపాలను, భద్రతా ఏర్పాట్లలో లోటుపాట్లను బట్టబయలు చేశాయి. ఈ సంఘటనలను ఒకసారి పరిశీలిద్దాం.
2024 జులైలో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన భోలే బాబా సత్సంగ్‌లో 121 మంది మరణించారు, ఇది ఇటీవలి కాలంలో అత్యంత ఘోరమైన తొక్కిసలాట ఘటనల్లో ఒకటిగా నిలిచింది. డిసెంబర్ 2024లో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2: ది రూల్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా జనం ఒక్కసారిగా తోసుకోవడంతో ఓ 35 ఏళ్ల మహిళ చనిపోగా, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు గాయపడ్డాడు. 2025 జనవరిలో తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వేలాది మంది భక్తులు తోసుకోవడంతో ఆరుగురు మరణించారు. అదే నెలలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజున భారీ జనసమూహం కారణంగా సంభవించిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025 మేలో గోవాలోని ఓ ఆలయం వద్ద జరిగిన మరో ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఈ ఘటనలన్నీ భద్రతా విధానాలు, జనసమూహ నిర్వహణలో సమన్వయం లేకపోవడాన్ని స్పష్టం చేస్తున్నాయి.