Business
కొత్త రిజిస్ట్రేషన్ బిల్లులో కేంద్రం కీలక మార్పులు – ప్రజల అభిప్రాయాల కోసం డ్రాఫ్ట్ విడుదల
దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908ను మరింత సమకాలీనంగా, పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ బిల్లును రూపొందించింది. ఈ బిల్లుకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను కేంద్ర న్యాయ శాఖ విడుదల చేసింది. ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు జూన్ 25 వరకు గడువును ప్రకటించింది.
కేంద్రం ప్రతిపాదిస్తున్న మార్పుల ప్రకారం, ఆన్‌లైన్ ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్, ఫేక్ డాక్యుమెంట్లపై కఠిన చర్యలు, అక్రమ లావాదేవీలకు అడ్డుకట్ట, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమయం, ఖర్చు తగ్గింపు వంటి అంశాలపై దృష్టి పెట్టింది.
ముఖ్యంగా, డిజిటల్ వనరులను వినియోగించేందుకు అవకాశం కల్పిస్తూ, ఆధునిక సాంకేతికతను రిజిస్ట్రేషన్ వ్యవస్థలోకి తీసుకురావాలని బిల్లులో పేర్కొంది. దీంతో భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఎక్కువసార్లు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసే మార్గాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
ఇకపోతే, కొత్త బిల్లులో ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్‌తో సింక్ అయ్యే విధంగా డేటా కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాన్సాక్షన్లలో డూప్లికేట్ డాక్యుమెంట్లను గుర్తించి నిరోధించే విధంగా మార్పులు చేయాలని సూచించబడింది.
ప్రజలకు మరింత న్యాయసమ్మతంగా, వేగంగా, నమ్మదగిన రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని న్యాయ శాఖ పేర్కొంది. జూన్ 25 తర్వాత అభిప్రాయాలను పరిశీలించి, తుది బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఈ నూతన చట్టంతో అసలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురయ్యే అవినీతి, ఆలస్యం, ఫ్రాడ్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కలగనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.