Connect with us

Andhra Pradesh

కాశీబుగ్గ ఆలయం విషాదం – తొక్కిసలాటపై హోం మంత్రి అనిత, పవన్ కళ్యాణ్ స్పందన

కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన తర్వాత పరిశీలనలో ఉన్న అధికారులు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయంలో మొదటి అంతస్తుకు వెళ్లే సమయంలో రెయిలింగ్ ఊడిపడటం వల్ల భక్తులు ఒకరిమీద ఒకరు పడడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించారు. గాయపడిన భక్తులకు తక్షణ వైద్యం అందించాలని ఆమె సూచించారు.

హోం మంత్రి అనిత మాట్లాడుతూ, “ప్రతి వారంలో వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. భక్తుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి” అని పేర్కొన్నారు. కాశీబుగ్గ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదని, ఇది ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయమని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ, “కాశీబుగ్గ ఆలయం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది. భక్తుల రక్షణకు ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి చేస్తున్నాం” అని వెల్లడించారు. ఈ ఘటన మళ్లీ జరగకుండా పర్యవేక్షణ చర్యలు చేపడతామని తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. కార్తీక ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని అన్నారు. “మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందించాలి” అని ట్వీట్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఆలయాల్లో భక్తుల రద్దీ సమయంలో సరైన క్యూ లైన్‌లు, పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.

Loading