Latest Updates
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారం: హరీశ్ రావు ఆగ్రహం
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉంటే, కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగినట్లు ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, ప్రాజెక్టు మొత్తం కూలిపోయినట్లు కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే పంటలు పండాయని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను హరీశ్ రావు తప్పుబట్టారు. “ఈ ఏడాది వర్షాలు బాగా కురిసాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) నుంచి మిడ్ మానేరు, అక్కడి నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు నీరు నిండాయి. ఈ జలాశయాలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే కదా?” అని ఆయన ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే రైతులకు సాగునీరు అందుతోందని, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని హరీశ్ రావు వివరించారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు ప్రాముఖ్యతను తగ్గించేలా తప్పుడు వాదనలు చేస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.