Devotional
కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం వెనుక గల ఆధ్యాత్మిక రహస్యం
కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో శివకేశవులను ప్రత్యేక పూజలతో ఆరాధించడం ఆనవాయితీ. చంద్రుడు కృతిక నక్షత్రంలో పౌర్ణమి నాడు సంచరించటంతో ఈ మాసాన్ని “కార్తీక మాసం” అని పిలుస్తారు. ఈ సమయంలో ఆలయాలు దీపాల కాంతితో వెలిగిపోతూ, భక్తులు దానధర్మాలు, తులసి పూజలు, పరిహారాలు చేసుకుంటూ ఆధ్యాత్మికతలో లీనమవుతారు.
ఈ మాసంలో ఉసిరి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉసిరి చెట్టును సాక్షాత్ శ్రీమహావిష్ణువు రూపంగా భావిస్తారు. ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారం, పౌర్ణమి రోజుల్లో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగి, కుటుంబంలో సౌభాగ్యం చేకూరుతుందని నమ్మకం ఉంది. ఉసిరికాయతో చేసిన దీపాలు అన్ని శుభాలు తెస్తాయని, ఇది ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక శక్తులను పెంచుతుందని పండితులు చెబుతున్నారు.
ఉసిరి దీపం వెలిగించేటప్పుడు ఉసిరికాయను మధ్యలో కట్ చేసి, అందులో నూనె వేసి వత్తివేసి దీపం వెలిగిస్తారు. సూర్యాస్తమయానికి ముందు లేదా తర్వాత దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తారు. దీని ద్వారా ప్రతికూల శక్తులు తొలగి, ఇంట్లో సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం ఉంది. మహిళలు దీపారాధన చేసి, ఉసిరికాయలను నివేదన చేసి, 11 ప్రదక్షిణలు చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తి లభిస్తుందని పురాణాలు పేర్కొంటాయి.
ఉసిరి దీపం వెలిగించడం వల్ల నవగ్రహ దోషాలు, పాప దోషాలు తొలగిపోతాయని, ఇంటికి నరదృష్టి దరి చేరదని చెబుతారు. ఉసిరి చెట్టును పూజించడం, దీపం పెట్టడం, దీపాలను దానం చేయడం వంటివి అపారమైన పుణ్యాన్ని అందిస్తాయని విశ్వాసం ఉంది. అందుకే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మహిళలు ఉసిరి దీపారాధనను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇది కేవలం సంప్రదాయం కాదు, మన ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.
![]()
