Andhra Pradesh
కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్: అనుచిత వ్యాఖ్యలపై చర్య – పూర్తి వివరాలు
హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్టు పెద్ద సంచలనం సృష్టించింది. కూకట్‌పల్లిలో ఆయనను తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.
ఇటీవల తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీష్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం మరింత సందేహాలకు దారితీసింది. అనంతపురం సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద ఆయన మృతదేహం కనిపించడం కేసును క్లిష్టం చేసింది. ఈ నేపధ్యంలో సోషల్ మీడియా వ్యాఖ్యలు, మీడియా డిబేట్‌లో చేసిన ఆరోపణలు పరిశీలనకు వచ్చాయి. వీటిలో కారుమూరు వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పోలీసుల దృష్టిని ఆకర్షించాయి.
ముఖ్యంగా కర్నూలు ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాలకెక్కాయి. ఒక టీవీ డిబేట్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో టిడిపి నాయకుడు ప్రసాదనాయుడు తాడిపత్రి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు నమోదై, ఆయన మొబైల్ సిగ్నల్ ద్వారా పోలీసులు హైదరాబాద్‌లోని మెరీనా స్కైస్ అపార్ట్‌మెంట్ వద్ద అరెస్ట్ చేశారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఇతర వైఎస్సార్సీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. శ్యామల, పూడి శ్రీహరి వంటి పలువురు పార్టీ నాయకులకు నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడు కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్ ఈ కేసుల నేపథ్యంలో జరిగిందా? లేక సతీష్‌కుమార్ మరణంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జరగిందా? అనే విషయంపై తాడిపత్రి పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ అరెస్ట్‌పై రాజకీయంగా భారీ రియాక్షన్లు రావడం ఖాయం.
![]()
