Latest Updates
కామారెడ్డిలో KTR ఘాటు వ్యాఖ్యలు: “రాష్ట్రం బాగుండాలంటే KCR రావాలి
తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ, రైతుబంధు నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎన్నికల హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా, ఢిల్లీకి సంచులు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ గడ్డపై దళితులను అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, “మేము అధికారంలో ఉండాలా? ప్రతిపక్షంలో ఉండాలా? అన్నది ప్రజలే నిర్ణయించాలి. కానీ రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాటలోకి రావాలంటే, రైతన్నల ముఖాల్లో నవ్వులు పూయాలంటే మళ్లీ కేసీఆర్ రావాల్సిందే” అని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించిన కేసీఆర్ను మళ్లీ సీఎంగా చూసే అవసరం ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా సేవకే అంకితమైందని, ఎలాంటి కుట్రలైనా ఎదుర్కొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.