Andhra Pradesh
కర్నూలులో ఘోర విషాదం – నీటిలో ఆరుమంది చిన్నారుల మృతి
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఒక నీటి కుంటలో ఆరుగురు చిన్నారులు ఈత కొట్టడానికి వెళ్లి దురదృష్టవశాత్తు మునిగి మృతిచెందారు. కుంటలో ఆడుకుంటూ లోతులోకి వెళ్లడంతో బయటపడలేకపోయారని సమాచారం. ఈ ఘటనతో గ్రామం అంతా షాక్‌కు గురైంది.
మృతులంతా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. ఒక్కసారిగా ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. పిల్లలు ఉదయం ఆటపాటలతో బయటకు వెళ్లి తిరిగి శవాలుగా రావడం చూసి గ్రామమంతా కన్నీటి వాతావరణంలో మునిగిపోయింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీశి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. ఒక్కసారిగా ఆరుగురు చిన్నారుల ప్రాణాలు బలికావడంతో చిగిలి గ్రామంలో తీరని విషాదం నెలకొంది.