International
ఐర్లాండ్లో భారతీయ మహిళపై జాత్యాహంకార దాడి – ‘ఇండియాకు పో’ అంటూ బెదిరింపు

ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో భారతీయ మహిళ శ్వేత వర్మపై జరిగిన జాత్యాహంకార దాడి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. జిమ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఓ స్థానిక మహిళ ఆమెను అడ్డగించి “ఇండియాకు పో” అంటూ జాత్యవివక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనను శ్వేత తన మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్ అయింది.
శ్వేత వర్మ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, “నేను ప్రతి రోజు నడుస్తున్న వీధిలో నా ఉనికిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆ మహిళ నన్ను ఆపి, ‘నీవు ఐర్లాండ్లో ఎందుకు ఉన్నావు? ఇండియాకు ఎందుకు వెళ్లిపోవడం లేదు?’ అని అడిగింది. నేను కొన్ని సెకన్లు షాక్లో నిలబడ్డాను” అని తెలిపింది.
తరువాత శ్వేత తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ తాను వీసాతో వచ్చానా? ఇల్లు అద్దెకు తీసుకున్నానా లేక సొంతమా? అనే ప్రశ్నలు కూడా అడిగిందని చెప్పింది. ఆధునిక సమాజంలో ఇంకా జాత్యవివక్ష, ద్వేషం ఉన్నాయనే విషయం ఈ సంఘటన మరోసారి నిరూపించిందని ఆమె పేర్కొన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. “నీ ఉనికి గురించి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ అనేక మంది స్పందించారు. విదేశాల్లో భారతీయులు ఎదుర్కొంటున్న జాత్యాహంకార దాడుల్లో ఇది తాజా ఉదాహరణగా నిలిచింది. ఇంతకు ముందు కూడా ఐర్లాండ్లో భారతీయులపై ఇలాంటి దాడులు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.