Andhra Pradesh

ఏపీ సర్కార్ భారీ ఆఫర్.. ఇ-సైకిళ్లపై రూ.10 వేల డిస్కౌంట్!

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ఇ-సైకిళ్లను భారీ రాయితీతో పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో ఒక్కరోజులోనే 5,555 ఇ-సైకిళ్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని ఇ-సైకిళ్లను పంపిణీ చేశారు.

అధికారులు చెప్పిన ప్రకారం, ఈ ఇ-సైకిళ్లు పూర్తిగా ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణించగలవు. ఒక్కో ఇ-సైకిల్ ధర 35 వేల రూపాయలు. ప్రభుత్వం 10 వేల రూపాయల రాయితీ ఇస్తోంది. కాబట్టి లబ్ధిదారులు 25 వేల రూపాయలకే ఇ-సైకిళ్లను కొనుగోలు చేయవచ్చు.

చిత్తూరు జిల్లా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. కుప్పంలో 24 గంటల వ్యవధిలో 5,555 ఇ-సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా ఈ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా గిన్నిస్ సంస్థ నుంచి వచ్చిన సర్టిఫికెట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని పర్యావరణ హిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇ-మోటోరాడ్ సంస్థతో ఒప్పందం కుదిరింది. ఈ ఇ-సైకిళ్లను కుప్పంలో అసెంబుల్ చేస్తారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, లబ్ధిదారులకు ఇ-సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా తూంసీలోని ప్రజావేదిక వరకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఇ-సైకిల్ ర్యాలీగా ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ప్రసంగంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కుప్పం కొత్త చరిత్రకు నాంది పలికిందన్నారు. గిన్నిస్ రికార్డు రావడం కంటే, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రజలకు అందించే ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. ఇంటి పైకప్పులపై ఉత్పత్తయ్యే విద్యుత్తుతోనే ఈ ఇ-సైకిళ్లను ఛార్జ్ చేసుకోవచ్చని, పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసిన ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

#EScycles#GreenAndhra#APGovernment#ChandrababuNaidu#Kuppam#EnvironmentFriendly#ElectricCycle#GreenTransport
#GuinnessRecord#ChittoorDistrict#SustainableDevelopment#APNews#PublicWelfare#EcoFriendlyInitiative

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version