Health
ఎర్రగడ్డ ఆస్పత్రిలో ఫుడ్ పాయిజన్.. ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో సోమవారం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 71 మంది రోగులు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరైన కరణ్ (30) అనే రోగి కార్డియాక్ అరెస్ట్‌తో మంగళవారం ఉదయం మృతి చెందాడు. మరో ముగ్గురు రోగుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్పందించి, అస్వస్థతకు గురైన రోగులకు ప్రాథమిక చికిత్స అందించారు.
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, వెంటనే చర్యలకు ఉపక్రమించింది. కలుషిత ఆహారం సరఫరా చేసిన ఆహార కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (RMO) డా. పద్మజపై సస్పెన్షన్ వేటు వేసింది. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి ఆస్పత్రిని సందర్శించి, వంటగది మరియు వార్డులను పరిశీలించారు. ఈ ఘటనకు కారణాలను గుర్తించేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంఈ పేర్కొన్నారు.