News
ఉపాధి హామీ ఉద్యోగులకు ఊరట.. వేతనాల పెంపుకు మార్గం సుగమం!
తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న చిరుద్యోగులకు శుభవార్త. గత 20 ఏళ్లుగా స్థిర ఉద్యోగుల్లా సేవలందిస్తున్న ఈ సిబ్బందికి ఇప్పుడు వేతనాల పెంపు ఆశ చూపింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను ఉపాధి హామీ ఉద్యోగులు కలసి, తమ సమస్యలు వివరించారు.
వాళ్లకు కూడా పే స్కేల్ అమలు చేయాలని, ప్రస్తుతం వారిని ఎఫ్‌టీఈ (ఫుల్ టైం ఎంప్లాయీస్) గా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా కేవలం రూ.30 కోట్లు మాత్రమే భారం పడుతుందని తెలిపారు.
మంత్రి సీతక్క వెంటనే స్పందిస్తూ, పే స్కేల్ అంశంపై ఫైల్ సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు. అలాగే దీనిని కేబినెట్ ముందుకు తీసుకెళ్లి చర్చించి, త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంతేగాక, జీతాల చెల్లింపులో ఆలస్యం చేస్తోన్న పే అండ్ అకౌంట్స్ అధికారులను కూడా మంత్రి హెచ్చరించారు. చిన్నచిన్న సాంకేతిక సమస్యలతో జీతాలు ఆపకూడదని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆదేశించారు.
ఈ ప్రకటనతో ఉపాధి హామీ ఉద్యోగులలో కొత్త ఆశలు రెకెత్తాయి. వేతనాల పెంపు సాధ్యమవుతుందనే నమ్మకం పెరిగింది. సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని వ్యవహరిస్తోన్న సీతక్క వ్యాఖ్యలు, రాష్ట్రంలోని చిరుద్యోగుల కోసం ప్రభుత్వం మరో మెట్టు ఎక్కబోతోందనే సంకేతాలు ఇస్తున్నాయి.