International
ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు షాక్ – ట్యూషన్ ఫీజులు భారీగా పెంపు!

బ్రిటన్‌లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థులకు పెద్ద షాక్ ఎదురైంది. యూకే ప్రభుత్వం ప్రతి సంవత్సరం యూనివర్సిటీలకు ట్యూషన్ ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే నాణ్యతా ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలకే ఈ సౌకర్యం లభిస్తుందని స్పష్టంచేశారు.
విద్యార్థులు చెల్లించే ఫీజులకు తగిన బోధన, పాస్టోరల్ సపోర్ట్, మంచి ఫలితాలను అందించే యూనివర్సిటీలకే ఫీజు పెంపు వర్తిస్తుంది. నాణ్యత లోపించిన విద్యాసంస్థలకు పెంపు అనుమతి ఇవ్వబోదని, జరిమానాలు కూడా విధించే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. తక్కువ ఆదాయం గల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మెయింటెనెన్స్ లోన్‌లు కూడా పెరగనున్నాయి.
2026–27 విద్యా సంవత్సరంలో ఈ కొత్త ఫీజు విధానం అమల్లోకి రానుంది. బ్రిటన్ విద్యాశాఖ కార్యదర్శి బ్రిడ్జెట్ ఫిలిప్‌సన్ మాట్లాడుతూ, విద్యార్థులు చెల్లించే భారీ ఫీజులకు తగిన స్థాయి బోధన అందించాలన్నదే ఈ సంస్కరణల లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ట్యూషన్ ఫీజులు 9,535 (సుమారు రూ.11 లక్షలు)కు పెరిగిన విషయం తెలిసిందే.
ఈ ఫీజు విధానంతో పాటు వృత్తి విద్యా రంగంలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. దాదాపు 900 టెక్నికల్ కోర్సులకు బదులుగా “V-Levels” అనే కొత్త అర్హతలను ప్రవేశపెట్టనున్నారు. జీసీఎస్ఈ మ్యాథ్స్, ఇంగ్లీష్ పరీక్షల్లో పాస్ కాని విద్యార్థుల కోసం కొత్త స్టెప్పింగ్ స్టోన్ కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ మార్పులు బ్రిటన్ విద్యా విధానంలో నాణ్యత, స్థిరత్వం, మరియు వృత్తి అవకాశాలను బలోపేతం చేయనున్నాయి.