Latest Updates

ఉద్యోగుల భద్రతకు బలమైన అడుగు.. రూ.కోటి వరకు హామీ

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా ఊరటనిచ్చే శుభవార్త. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి భద్రతకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఉద్యోగులకు ఏకంగా రూ.1 కోటి ప్రమాద బీమా కల్పించే పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శాసనసభలో అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం సింగరేణి కార్మికులు, విద్యుత్ శాఖలోని డిస్కమ్స్ ఉద్యోగులకు ఈ రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం అమల్లో ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. అయితే ఈ పథకాన్ని కేవలం ఈ రెండు విభాగాలకే పరిమితం చేయకుండా, తెలంగాణ ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు వర్తింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ఎదుర్కొనే ప్రమాదాల నుంచి వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ప్రమాద బీమా పథకాన్ని బ్యాంకుల సహకారంతో అమలు చేస్తోంది. దీంతో ప్రభుత్వానికి లేదా సంబంధిత శాఖలకు అదనపు ఆర్థిక భారం పడదు. ఉద్యోగి మరణిస్తే లేదా ప్రమాదానికి గురిస్తే, వారి కుటుంబానికి రూ.1 కోటి వరకు ఆర్థిక సహాయం అందుతుంది.

ప్రభుత్వం కేవలం బీమా పథకాలకే పరిమితం కాకుండా, కార్మికుల ఆరోగ్య సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది సహా ఇతర పోస్టులను వచ్చే మార్చి నెల నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.

గోదావరిఖనిలో సింగరేణి కార్మికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన క్యాత్ ల్యాబ్‌ను మరో 75 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. ఇది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే కార్మికులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.

సింగరేణి ఉద్యోగులు సింగరేణి కోసం ఏళ్ల తరబడి సేవలందించారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, గృహ వసతి కల్పించడం వంటి విషయాలపై సింగరేణి బోర్డుతో ప్రభుత్వం చర్చించనుంది. త్వరలోనే సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని భట్టి విక్రమార్క చెప్పారు.

తెలంగాణను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ – 2047’ అనే విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది. ఈ డాక్యుమెంట్‌ను కూడా ఆయన సభలో ప్రవేశపెట్టారు.

ప్రభుత్వ ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో విశేష స్పందనను రేపుతున్నాయి.

#Telangana#GovernmentEmployees#AccidentInsurance#OneCroreInsurance#EmployeeWelfare#BhattiVikramarka#TelanganaGovernment
#Singaren#PowerDepartment#WorkerSafety#PublicSector#EmployeeSecurity#TelanganaRising2047#BreakingNews#LatestNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version