National
ఈ తొక్కలో సోన్ పాపడి మాకొద్దు: హర్యానాలో కంపెనీ బహుమతిపై ఉద్యోగుల ఆగ్రహం – గేటు ముందు విసిరేసిన గిఫ్ట్‌లు!

దీపావళి సందర్భంగా ఉద్యోగులకు బోనస్ లేదా బహుమతులు ఇవ్వడం చాలా సంస్థల్లో సాధారణం. కానీ, హర్యానాలోని గన్నౌర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో చోటుచేసుకున్న సంఘటన మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కంపెనీ యాజమాన్యం ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్‌గా “సోన్ పాపిడి” డబ్బాలను అందించగా, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వారికి నగదు బోనస్ లేదా గిఫ్ట్ కార్డులు వస్తాయని ఆశించగా, తీపి బహుమతి రావడం వారిని నిరాశకు గురిచేసింది. దాంతో ఉద్యోగులు కంపెనీ గేటు ముందు ఆ సోన్ పాపిడి డబ్బాలను విసిరివేశారు. “ఈ తొక్కలో సోన్ పాపిడి మాకొద్దు” అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆ దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతీ ఏడాది పండుగల సమయంలో స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, గిఫ్ట్ హ్యాంపర్లు ఇవ్వడం అనేక కంపెనీలలో ఒక సంప్రదాయంగా ఉన్నా, ఈ తరం ఉద్యోగులు ఆ పద్ధతి పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వారి అభిప్రాయం ప్రకారం పండుగల సమయంలో అవసరాలను తీర్చుకునేందుకు క్యాష్ బోనస్ లేదా ఆన్‌లైన్ గిఫ్ట్ కార్డులు మరింత ఉపయోగకరంగా ఉంటాయి.
తాజాగా నిర్వహించిన ఒక ఉద్యోగ సర్వే ప్రకారం 48% కంటే ఎక్కువ మంది ఉద్యోగులు “స్వీట్లు లేదా డ్రై ఫ్రూట్స్ కంటే క్యాష్ లేదా గిఫ్ట్ కార్డులు కావాలి” అని స్పష్టం చేశారు. మరోవైపు దేశంలోని కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు – కార్లు, ట్రిప్‌లు, గాడ్జెట్‌లు ఇస్తుండగా, కొంతమంది మాత్రం ఇప్పటికీ తీపి బహుమతులతోనే సరిపెడుతున్నారు.
హర్యానాలో జరిగిన ఈ సంఘటన ఉద్యోగుల్లో వస్తున్న కొత్త ఆలోచనను ప్రతిబింబిస్తోంది – తీపి కంటే విలువైన గుర్తింపు కోరే తరం ఇదే అని చెప్పొచ్చు.